

మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి రైతులను అయోమయంలోకి నెట్టేందుకు అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రస్తుత రబీ సీజన్లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ₹2,310 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. రబీ సీజన్ కొనుగోళ్ల కోసం ₹21 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. టార్పాలిన్లు, గన్ని బ్యాగులు, గోదాములు, రవాణా వాహనాలు, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా టోకెన్ వ్యవస్థ, ప్రత్యేక కంట్రోల్ రూమ్, నోడల్ అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాలు పేరుతో కోతలు విధించినా, తూకాల్లో అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల విస్తరణ రికార్డు స్థాయికి చేరాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!