

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో “మూసీ గోస–బీజేపీ భరోసా పరామర్శ యాత్ర” లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ నుంచి ప్రారంభమైంది. అనంతరం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో తమ ఇళ్లు కోల్పోతున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇళ్లు కోల్పోతామన్న భయంతో మహిళలు, వృద్ధులు కన్నీటి పర్యంతమవుతుండగా, వారి సమస్యలను రాంచందర్ రావు శ్రద్ధగా విన్నారు. బలవంతపు కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని స్పష్టం చేశారు. మూసీ నది శుద్ధి, కాలుష్య నివారణకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని, కేంద్ర సహకారం ఉందన్న ప్రచారం అసత్యమని తెలిపారు. భూ నిర్వాసితుల బతుకు పోరాటంలో బీజేపీ ముందుండి ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!