

మియాపూర్‌లోని విలువైన భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మియాపూర్‌లో సుమారు 550 ఎకరాల భూముల విలువ దాదాపు రూ.50 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ద్వారా ఈ భూములను కైవసం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో విలాసవంతమైన కార్లు, నగదు రూపంలో ముడుపులు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించిందని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఎంజీ భూములు, కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ, మంచిరేవుల, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో భూముల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేసినట్లు వివరించారు. మియాపూర్ భూములను విక్రయించడం ద్వారా వచ్చే నిధులను నీటిపారుదల, విద్య, వైద్యం వంటి రంగాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భూ ఆక్రమణలపై చర్చించేందుకు బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!