

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థగా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే సిస్టమ్‌లో చేర్పిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఓటు హక్కు విషయంలో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి పౌరుడి హక్కును కాపాడాలని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని, బాధిత ఓటర్లను తీసుకువచ్చి వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణల్లో ఫామ్-6, ఫామ్-7 దరఖాస్తుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారా లేదా అన్నదానిపై రామచంద్రరావు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు అంశాన్ని మతపరమైన కోణంలోకి మళ్లించకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. అదే సమయంలో, కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి చేసిన మేలుతో పాటు విభజన హామీల అమలుపై సమాధానం చెప్పాలని కోరారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టి అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!