

మరణం తర్వాత నిర్వహించాల్సిన అంత్యక్రియల కోసం కూడా ముందుగానే ప్రణాళిక రూపొందించుకునే సరికొత్త సేవను ఢిల్లీకి చెందిన స్టార్టప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మోక్ష్ వాయేజ్’ పేరుతో పనిచేస్తున్న ఈ సంస్థ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడం, అంతిమయాత్రకు అవసరమైన వ్యక్తులను ఏర్పాటు చేయడం, పూలు, దహన సంస్కారాలకు అవసరమైన సామగ్రి, పూజారుల సేవలు, చివరి సంస్కారాలు వంటి ఏర్పాట్లను చేపడుతోంది. ప్యాకేజీల ధరలు ఎంపిక చేసుకునే సేవలను బట్టి సుమారు రూ.6 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉన్నాయి.
ఈ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. జీవించి ఉన్నప్పుడే తమ అంత్యక్రియలను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించడం. మరణానంతరం కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడంతో పాటు, తమ చివరి ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా నిర్ణయించుకునే అవకాశం కల్పించడమే ఈ ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే 300 మందికి పైగా ఈ సేవ కోసం పేర్లు నమోదు చేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంత్యక్రియల నిర్వహణలో కుటుంబ సభ్యులపై పడే బాధ్యతను తగ్గించే ఈ వినూత్న విధానం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!