

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రాహుల్ గాంధీ పేరు, ఫొటోలతో ఉన్న పోస్టులను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తున్నారంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సోషల్ మీడియా విభాగం బాధ్యుడు మను జైన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెట్టిన సాధారణ రాజకీయ, వ్యక్తిగత పోస్టులు సైతం భారత్‌లో అందుబాటులో లేకుండా చేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపిన వివాహ పత్రికలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, మాజీ ప్రధానమంత్రికి నివాళులు, కార్యకర్తలతో ఆయన దిగిన ఫొటోలు కూడా తొలగింపునకు గురయ్యాయని పేర్కొన్నారు.
బీజేపీకి అనుకూలంగా ఉన్న ఏఐ కంటెంట్‌ను అనుమతిస్తూ, ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులను మాత్రం నియంత్రిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, మనీష్ శర్మ ఖాతాలపై విధించిన పరిమితులను కూడా పార్టీ ప్రస్తావించింది. ఆటోమేటిక్ కంటెంట్ నియంత్రణకు సంబంధించిన ఐటీ నిబంధనలను సైతం పిటిషన్‌లో సవాలు చేసింది. మరోవైపు, చట్టపరమైన ఆదేశాల మేరకు గతంలో తొలగించిన కంటెంట్ మళ్లీ ప్రచారంలోకి రాకుండా ఒకే రకమైన పోస్టులను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తున్నామని మెటా తెలిపింది. ఈ వ్యవహారంపై న్యాయపరమైన విచారణ కొనసాగాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!