

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిశహర్‌లో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమె కారును కొంతమంది నిరసనకారులు చుట్టుముట్టారు. ‘దొంగ.. దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ బురద, రాళ్లు, చెప్పులు విసిరారు. పోలీసు కస్టడీలో పార్టీ కార్యకర్త మృతి చెందడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత అక్కడికి వెళ్లారు. నిరసనకారులు ఆమెను అడ్డుకోవడంతో పోలీసులు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆమెను అక్కడి నుంచి తరలించారు.
తన పర్యటన గురించి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కుట్రలో భాగమని మమతా బెనర్జీ ఆరోపించారు. తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని, తలకు తీవ్ర గాయం అయి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. భాజపాను పోలీసులు రక్షిస్తున్నారని, పోలీసు, మాఫియా శక్తులతో కలిసి ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేస్తానని తెలిపారు. మరోవైపు, ఈ ఘటన తీవ్ర ప్రజాగ్రహానికి ప్రతీక అని సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రజలు మమతను ‘దొంగ’ అని పిలవడానికి ఆమె పాలనలో జరిగిన అవినీతే కారణమని ఆరోపిస్తూ, ఈ ఘటనలో భాజపా ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!