

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను ప్రయోజనాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం 2021, 2024లో తీసుకొచ్చిన రెండు పింఛను చట్టాలను కొట్టివేసింది. ఈ చట్టాల ప్రకారం, ఉద్యోగులు క్రమబద్ధీకరణకు ముందు రోజువారీ వేతనాలు, మస్టర్ రోల్ లేదా వర్క్ ఛార్జ్డ్ విధానాల్లో పనిచేసిన కాలాన్ని పింఛను లెక్కింపులో పరిగణించకుండా ఉండేవారు. అయితే, క్రమబద్ధీకరణకు ముందు ప్రభుత్వానికి అందించిన సేవను పూర్తిగా విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో క్రమబద్ధీకరణకు ముందు తాత్కాలికంగా లేదా రోజువారీ వేతనాలపై పనిచేసి, ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. వారు మాత్రమే కాకుండా, వారి వారసులు కూడా పింఛను కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. వచ్చిన దరఖాస్తులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పింఛను దరఖాస్తును తిరస్కరించే ముందు సంబంధిత ఉద్యోగికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలని, తిరస్కరణకు సరైన కారణాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!