

గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీలు ఐక్యంగా పనిచేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అత్యధిక స్థానాలను మంచి మెజారిటీలతో కైవసం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగుతోందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల చాలామంది రాజకీయాలకు దూరమయ్యారని ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. 34 శాతానికి బదులుగా బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. బీసీలకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. మేయర్, చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించే నిర్ణయంతో పాటు ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ప్రశంసించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆయన అనుభవంతో రాష్ట్రం ఆ పరిస్థితులను అధిగమించగలుగుతోందని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి పాలన కొనసాగడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
వైసీపీ పాలనలో ప్రతిపక్షాలకు కనీసం నామినేషన్లు వేసే అవకాశం కూడా కల్పించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైందని అన్నారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారంటూ కూటమిపై ఆరోపణలు చేస్తున్న వారికి ఇటీవల బ్యాలెట్ పద్ధతిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సమాధానమని పేర్కొన్నారు. ఈ విజయం అలాంటి విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మరోసారి ప్రజలను కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!