

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బుధవారం కూడా జమ్మూకశ్మీర్‌లో కఠిన ఆంక్షలు కొనసాగాయి. ప్రభుత్వం శనివారం వరకు విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించగా, మొబైల్ ఇంటర్నెట్ వేగంపై కూడా నియంత్రణ కొనసాగుతోంది. ప్రజలు గుమికూడకుండా భద్రతా బలగాలు అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా షియా వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలు, నిరసనలు నమోదైన ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో శ్రీనగర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టుపై సైబర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల విషయంలో భారత్ మౌనం వహించడాన్ని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అర్థంకాని విషయంగా వ్యాఖ్యానించారు. గతంలో భారత్ అణుపరీక్షల సమయంలో ఇరాన్ మద్దతుగా నిలిచిందని గుర్తుచేస్తూ, ప్రస్తుత వైఖరిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుల దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఆమె నిరసన వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!