

నిరుపేద, అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి. రెరా ఛైర్మన్ శ్రీనివాసరాజు నుంచి అనుమతి పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ అందుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అనుమతులతో ప్రాజెక్టుల అమలులో పారదర్శకత, నిబంధనల పాటింపు, లబ్ధిదారుల హక్కుల పరిరక్షణకు మరింత భరోసా లభించనుంది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 20 నియోజకవర్గాల్లో సుమారు 12 వేల ఇళ్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టింది.
ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వం ఉచితంగా అందించడంతోపాటు, లబ్ధిదారులకు సంబంధిత ఫ్లాట్‌కు చెందిన అవిభక్త భూమి వాటా (యూడీఎస్)ను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తవుతాయనే నమ్మకాన్ని లబ్ధిదారుల్లో పెంచేందుకు రెరా అనుమతులు కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా రెరా గుర్తింపు పొందిన ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. తొలిదశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.30–50 లక్షల విలువ చేసే ఫ్లాట్లను ప్రభుత్వం అర్హులైన పేదలకు కేవలం రూ.6 లక్షలకే అందిస్తోంది. ఈ అనుమతులు హౌసింగ్ బోర్డు చరిత్రలో కీలక మైలురాయని వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ సేవలను కొనసాగిస్తామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!