

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి తారాస్థాయికి చేరింది. అయితే ప్రచారం ఉధృతంగా సాగుతున్నా, ఓటర్ల మనసు మాత్రం ఎవరికీ అర్థమవడం లేదు. నామినేషన్లు ముగిసి వారం దాటినా, ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్డు మీదే తిరుగుతున్నారు. కానీ ఎవరి మద్దతు తమవైపు ఉందో అన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాలేదు.ఎవరైతే ఇంటింటికి వెళ్లి మద్దతు కోరుతున్నారో, వారికే ఓటర్లు “మా ఓట్లు మీకే” అంటూ భరోసా ఇస్తున్నారు. కానీ, అదే మాట పోలింగ్ రోజున నిలబడుతుందో లేదో అనే సందేహం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఏ కాలనీ, ఏ బస్తీ, ఏ వర్గం ఓటు ఎవరికి పడుతుందో అంచనా వేయలేక పార్టీ నేతలు గందరగోళంలో ఉన్నారు. ఇక ప్రచారం వేగం రోజురోజుకూ పెరుగుతోంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నుంచి ప్రతిపక్ష మాజీ నాయకుల దాకా అందరూ క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నారు. ప్రతి ప్రధాన నాయకుడికి వెయ్యి పైచిలుకు ఓట్ల బాధ్యత అప్పగించారు. వారి కింద చిన్న బృందాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు ఇళ్లకెళ్లి ప్రచారం సాగిస్తున్నారు.
ఓటర్లతో మాట్లాడినప్పుడు “మా ఓటు మీకే.. ఇంకో యాభై ఓట్లు కూడా వేయిస్తాం” అని మాటిస్తున్నవారు, అదే మాట ప్రతి అభ్యర్థికీ చెబుతున్నారు. “మనం చెప్పిన మాటే చట్టం” అంటూ ధైర్యం ఇచ్చే ఈ మాటలు అభ్యర్థులను నమ్మకం కలిగిస్తున్నప్పటికీ, వాస్తవం ఏంటో ఎవరికీ తెలియని స్థితి. ఎవరి ప్రచారానికి వెళ్తే వారికే మద్దతు తెలుపుతున్న ఓటర్లు ఇప్పుడు ఎన్నికల మిస్టరీగా మారారు. మాట ఇచ్చిన వారు పోలింగ్ రోజున ఎవరికి ఓటు వేస్తారో, లేదా ఎవరు గెలిస్తే వారినే తమ ఓటు వేసామంటారో అన్న సందేహం అన్ని పార్టీల్లోనూ అలజడి రేపుతోంది. ఈ అర్థం కాని ఓటరు నాడి — జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చింది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఆసక్తిగా మారింది