

భారత్, జపాన్ దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక సహకారం ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సైబర్ గార్డెన్స్ వేదికగా నిర్వహించిన జపాన్ ఫెస్టివల్-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కూడా హాజరయ్యారు. సాంకేతికత, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్య, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో భారత్–జపాన్ సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయని స్పీకర్ తెలిపారు.
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకుంటోందని గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆధునిక తయారీ, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌తో సహకారాన్ని పెంచుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. హిరోషిమా శాంతి, స్థిరత్వం, మానవ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. భారత్–జపాన్ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు పరస్పర సహకారంతో పాటు ప్రజల మధ్య సంబంధాలను విస్తరించుకోవాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!