

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల జరిగిన లిస్ట్-ఏ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి అసాధారణ ఇన్నింగ్స్‌పై పలువురు క్రికెట్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ కూడా వైభవ్ ఆటతీరుపై స్పందించాడు. అతడు ఎంతో ఉత్సాహంగా, వినోదాత్మకంగా బ్యాటింగ్ చేస్తాడని ప్రశంసించాడు. టీ20 క్రికెట్‌కు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరణ చూపుతున్నా, టెస్టులకు సంప్రదాయ అభిమానులు ఉన్నారని, 50 ఓవర్ల ఫార్మాట్‌కు కూడా క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ లాంటి ప్రతిభావంతులు ఆటకు మేలు చేస్తారని చెబుతూనే.. తమ బౌలర్లపై మాత్రం 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఇక క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న రెండో టెస్టు పిచ్ పరిస్థితులపైనా ఓరమ్ మాట్లాడాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌తో పోలిస్తే హాగ్లీ ఓవల్‌లో పేస్, బౌన్స్, బంతి కదలిక ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపాడు. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారవచ్చని అభిప్రాయపడ్డాడు. వాతావరణం, ఉష్ణోగ్రత, గాలి ప్రభావం, పిచ్ పరిస్థితులను పరిశీలించిన తర్వాత బౌలింగ్ వ్యూహాలను ఖరారు చేస్తామని వివరించాడు. గత ఏడాది ఇదే మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జస్టిన్ గ్రీవ్స్ డబుల్ సెంచరీ సాధిస్తూ తమ జట్టుకు డ్రా అందించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఆరంభంలో పిచ్ కఠినంగా కనిపించినా, క్రీజులో నిలదొక్కుకుంటే బ్యాటింగ్ సులభమవుతుందని పేర్కొన్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!