

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో పై చేయి సాధించాలనే లక్ష్యంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారత్ తో రక్షణ రంగ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రూపొందించిన వార్షిక రక్షణ విధాన బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం సంతకం చేశారు.
2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘జాతీయ రక్షణ అధికార చట్టం’ ద్వారా భారత్–అమెరికా రక్షణ భాగస్వామ్యం కొత్త స్థాయికి చేరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, భద్రమైన వాతావరణాన్ని కొనసాగించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటోంది.
అంతేకాదు, క్వాడ్ కూటమిలో భారత్ నిర్వహిస్తున్న పాత్రకు ఈ చట్టం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొనేందుకు మిత్ర దేశాలతో కలిసి ముందుకు సాగాలని అమెరికా భావిస్తోంది.
బిల్లు ఆమోదం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ బాహ్య, అంతర్గత ముప్పుల నుంచి దేశాన్ని రక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రక్షణ రంగంలో పారిశ్రామిక పునాదులను బలోపేతం చేయడం, సైనిక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జాతీయ భద్రతను మరింత బలపరుస్తామని చెప్పారు. ఇండో-పసిఫిక్లో చైనా ప్రభావాన్ని నియంత్రించాలంటే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఈ చట్టం ద్వారా భారత్–అమెరికా వ్యూహాత్మక భద్రతా సంభాషణలో అణు బాధ్యత నియమాలపై సంయుక్త సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా స్థానం కల్పించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!