

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రధాన లక్ష్యం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా వివిధ రకాల పండ్లను సాగు చేసే అవకాశాలతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, పరిశోధన, మార్కెటింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
చంద్రబాబు ముందుచూపుతో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో రాయలసీమలో నీటి లభ్యత మెరుగుపడుతోందని లోకేశ్ అన్నారు. చంద్రబాబును “వాటర్ మ్యాన్”గా అభివర్ణిస్తూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందనను ఆయన విమర్శించారు. హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించి.. పంటల ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు సమగ్ర వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!