

అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని మంత్రి పేర్కొన్నారు. లంక ప్రాంత రైతులు కూడా తమకు కేటాయించిన ప్లాట్లను ఇదే విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అంశం పై నెలకొన్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు.
ప్రతి గ్రామానికి సంబంధించిన యూనిట్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే ఏర్పాట్లు చేశామని, రైతులు ఈ సౌకర్యాన్ని సులభంగా వినియోగించుకోవచ్చని మంత్రి నారాయణ సూచించారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
అసైన్డ్ భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల పై ఉన్న ‘అసైన్డ్’ గుర్తింపును తొలగించే ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆ ప్లాట్లు పట్టా భూములుగా పరిగణించబడతాయి. దీంతో రైతులు తమ ప్లాట్లను అమ్మడం, మిగతా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరింత సులభమవుతుందని తెలిపారు.
తాజాగా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆరు నెలల్లోగా రాజధాని రైతులతో సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి మరోసారి గుర్తు చేశారు. ఇంకా ప్లాట్లు కేటాయించాల్సిన 719 మంది రైతులకు త్వరలోనే కేటాయింపు పూర్తి చేసి, రాబోయే నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయడమే లక్ష్యమని వెల్లడించారు.
రాజధాని నిర్మాణంతో పాటు రైతుల పెండింగ్ పనులన్నీ ప్రభుత్వం తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని నారాయణ తెలిపారు.
ఇక రాజధాని అభివృద్ధి విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో వేరు సమావేశం నిర్వహించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రాజెక్టులకు కావాల్సిన భూమి ప్రస్తుత పరిమితిలో సరిసంబంధం కాదని పేర్కొన్నారు. ఈ కారణంగా అమరావతి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలంటే రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, భవిష్యత్తు విస్తరణ అవసరాల కోసం అదనపు భూమి కీలకమని చెప్పారు.
















కామెంట్స్ (1)
Good news for amaravathi people