

జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఆయన చేసిన త్యాగాలు కూటమి విజయానికి దోహదపడ్డాయని అన్నారు.
ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను గత సార్వత్రిక ఎన్నికల నిర్ణయాలతో ముడిపెట్టడం సరికాదని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కొనసాగిస్తూ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి అభిప్రాయాలను గౌరవిస్తూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!