

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ప్రజలకు మరింత సులభంగా మార్చింది. గతంలో క్లిష్టంగా ఉండే ఈ ప్రక్రియను ఇప్పుడు నిరంతర సేవగా మారుస్తూ, గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి, ఈ బాధ్యతను డిజిటల్ సహాయకులకు అప్పగించింది.
ప్రత్యేకంగా కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు రేషన్ కార్డు పొందడం ఇప్పుడు చాలా ఈజీ అయింది. భార్య, భర్త ఆధార్ కార్డులు, భర్త పాత రేషన్ కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రం — ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఈ పత్రాలతో సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే, డిజిటల్ సహాయకులు ‘మ్యారేజ్ స్ప్లిట్’ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేస్తారు. ఈకేవైసీ పూర్తి చేసి, వీఆర్వో మరియు తహసీల్దారు పరిశీలన అనంతరం కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతుంది.
అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లను చేర్చే ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. పిల్లల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలతో సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సంబంధిత అధికారుల అనుమతి వచ్చిన వెంటనే కొత్త పేర్లు కార్డులో నమోదు చేస్తారు.
కొత్త కార్డులు, పేర్ల చేర్పులతో పాటు చిరునామా మార్పు వంటి సేవలను కూడా సచివాలయాల ద్వారానే అందిస్తున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ, కార్డుల జారీకి ప్రభుత్వం సమయపాలన నిర్ణయించింది. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసిన వారికి జులైలో, జులై నుంచి డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసిన వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!