

‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగిస్తూ తన నియోజకవర్గంలోనే 80 వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
బిహార్, బెంగాల్‌లో అనుసరించిన విధానాలను ఉపయోగిస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘సర్’కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఓట్లతోనే 2029లో ప్రధాని మోదీ ఓటమికి పునాది పడుతుందని అన్నారు. ఓట్ల తొలగింపుపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశానికి మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించిన సీఎం.. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!