

అక్రమ వలసలను నియంత్రించడం, వివిధ దేశాల్లో కొనసాగుతున్న ఎనిమిది యుద్ధాలను నిలువరించడం ద్వారా తాను గణనీయమైన విజయాలు సాధించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఏడాది ముగింపు సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
తాను విధించిన ప్రతీకార సుంకాల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ట్రంప్ తెలిపారు. గత 11 నెలల క్రితం దేశం పూర్తిగా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉందని, అటువంటి సమయంలోనే పాలనా బాధ్యతలు చేపట్టిన తాను ప్రస్తుతం పరిస్థితిని క్రమబద్ధం చేస్తున్నానని అన్నారు.
గత జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను సాధించిన విజయాలను ట్రంప్ వివరించారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ వివాదాలను తగ్గించడం, సుంకాల ద్వారా వందల కోట్ల డాలర్లు ప్రభుత్వానికి సమకూర్చడం, అలాగే ఉపాధి అవకాశాలు సృష్టించడం తన ప్రధాన విజయాలుగా ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అక్రమంగా అమెరికాకు వచ్చి స్థానికుల ఉద్యోగాలను దెబ్బతీస్తూ, నివాస ఖర్చులు పెరిగేలా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించినట్లు ట్రంప్ చెప్పారు. తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్’ అని ఆయన వ్యాఖ్యానించారు.
క్రిస్మస్ సందర్భంగా అమెరికా సైనికులకు ఒక్కొక్కరికి 1,776 డాలర్ల చొప్పున బోనస్ చెక్కులు పంపిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘వారియర్ డివిడెండ్’ పేరుతో 14.5 లక్షల మంది సైనికులకు ఈ ప్రత్యేక కానుక అందిస్తున్నామని తెలిపారు. దీనికి అవసరమైన నిధులు ఇతర దేశాల పై విధించిన సుంకాల ద్వారానే సమకూరాయని స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణానికి బాధ్యత తనకు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ దేనని ట్రంప్ ఆరోపించారు. తాను ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశానని చెబుతున్నప్పటికీ, సాధారణ ప్రజల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
సుంకాలు పెంచిన తరువాతే ధరలు గణనీయంగా పెరిగాయని, ఉద్యోగ అవకాశాలు తగ్గాయని చాలామంది అమెరికన్లు భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!