

విపక్ష ఎంపీల సమావేశం ముగిసిన అనంతరం దిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలు మరోసారి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో ఈసీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని పేర్కొన్న రాహుల్.. వాటిని తాను పతకాలుగా భావిస్తానన్నారు. ఇప్పటివరకు తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, వాటి సంఖ్య 100కు చేరడం తన లక్ష్యమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ, రాజ్యసభకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలిసేందుకు ప్రయత్నించారని, అయితే తమకు అనుమతి నిరాకరించారని రాహుల్ గాంధీ తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. తాము లేవనెత్తుతున్న అంశాలపై పోరాటం కొనసాగుతుందని, జంతర్ మంతర్ వద్ద కూడా నిరసన చేపడతామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష ఎంపీలు బస్సుల్లో జంతర్ మంతర్ వైపు బయల్దేరారు. వారిని అడ్డుకునేందుకు జంతర్ మంతర్ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!