

రాజకీయ పార్టీల నిర్ణయాల వెనుక ఎప్పుడూ ఒక లెక్క ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ తీసుకునే ప్రతి అడుగు – ఓటు బ్యాంక్ లెక్కలో భాగమేనని చెబుతారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా అదే తరహాలో ఉందన్న చర్చ సాగుతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, పార్టీ వర్గాలు మాత్రం త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముందని చెబుతున్నాయి.
ఇప్పుడు ప్రశ్న — ఇంత తొందరగా ఈ నిర్ణయం ఎందుకు?
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలుతో పాటు బీహార్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ మైనారిటీ వర్గంలో తమ ప్రభావం తగ్గిందని గుర్తించిన కాంగ్రెస్, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజారుద్దీన్ ప్రస్తుతం శాసనసభ గానీ, మండలి గానీ సభ్యుడు కాదు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం - రాజకీయ వ్యూహాత్మకం. రేవంత్ కేబినెట్లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం 18 మందికి అవకాశం ఉంది. అయితే మిగిలిన రెండు స్థానాల కంటే ముందుగా అజారుద్దీన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం, ఈ నిర్ణయం ఎన్నికల దృష్ట్యా తీసుకున్నదేనని స్పష్టమవుతోంది. అజారుద్దీన్‌ను ఇప్పుడే మంత్రిగా నియమించినా, చట్టపరమైన ఇబ్బంది లేదు. ఆరు నెలల్లో ఆయనను శాసన మండలికి పంపించవచ్చు. త్వరలో మూడు మండలి సీట్లు ఖాళీ కానున్నాయి కాబట్టి, అందులో ఒకదానిలో ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉంది.
మొత్తం మీద, కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా తీసుకున్నదని, మైనారిటీ వర్గంలో మళ్లీ తమ బలం పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు.











కామెంట్స్ (2)
Smart political strategy by Congress
రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది