

షి జిన్‌పింగ్ మరియు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా ప్రపంచ ఆధిపత్య ప్రయత్నాలను తీవ్రంగా విమర్శిస్తూ బహుధ్రువ ప్రపంచ వ్యవస్థ అవసరాన్ని పునరుద్ఘాటించారు. బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు “బహుధ్రువ ప్రపంచ ప్రకటన”పై సంతకాలు చేసి, ఏకపక్ష ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలిక వ్యూహాత్మక సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కొన్ని దేశాలు తమ అభిప్రాయాలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయని, ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నాయని షి జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఉభయులకు లాభదాయకమైన సహకారం ఆధారంగానే చైనా-రష్యా సంబంధాలు బలపడుతున్నాయని నేతలు తెలిపారు.
ప్రపంచ పాలన వ్యవస్థలో మార్పులకు కట్టుబడి వాణిజ్యం, సాంకేతికత తదితర రంగాల్లో సుమారు 20 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. “ఒకే చైనా” విధానానికి మద్దతు తెలుపుతూ తైవాన్ చైనాలో విడదీయరాని భాగమని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేపడుతున్న సైనిక చర్యలను ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన “గోల్డెన్ డోమ్” రక్షణ ప్రణాళికపై కూడా విమర్శలు గుప్పించారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత విస్తరించకుండా వెంటనే చర్చలు ప్రారంభించాలని షి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితం కుదిరిన చైనా-రష్యా సహకార ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!