

భారత్ సమ్మిట్ 2026లో భారతదేశ అంతర్గత రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఇటలీకి చెందిన రాజకీయ నాయకుడు, పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్పై తెలంగాణ బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్ శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులను కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించింది. నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో ఫిలిబెక్ పాల్గొనడం, ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అనే రాజకీయ నినాదం చేయడంపై సమగ్ర విచారణ జరపాలని కోరింది.
ఫిలిబెక్ ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు? పర్యటన ఉద్దేశం ఏమిటి? వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలను పాటించారా? అనే అంశాలను పరిశీలించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్లు 23, 24 ప్రకారం విచారణ జరిపి, ఉల్లంఘనలు నిర్ధారణైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సమ్మిట్ నిర్వాహకులు, స్పాన్సర్ల పాత్రతో పాటు కేంద్ర హోం, విదేశాంగ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందారా అనే అంశాలపైనా దర్యాప్తు చేయాలని సూచించింది. కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, చట్టపరమైన కారణాలు నిర్ధారణైతే ఫిలిబెక్ను దేశం నుంచి బహిష్కరించే అంశాన్ని పరిశీలించాలని ఫిర్యాదులో పేర్కొంది. భారత చట్టాలకు విదేశీ పౌరులెవరూ అతీతులు కారని రాంచందర్ రావు స్పష్టం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!