

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా వినియోగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్కు లేఖ రాస్తూ, విద్యుత్ బిల్లులు, డీజిల్ ఖర్చులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, కాంట్రాక్టర్ల పాత బకాయిల చెల్లింపులకు ఈ నిధులను మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇది 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243G అధికరణం, 11వ షెడ్యూల్, అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు విరుద్ధమని ఆయన ఆరోపించారు.
విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.2,293.74 కోట్లను విడుదల చేయగా, మరో రూ.729.41 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, సర్పంచులు, కార్యదర్శులపై మౌఖిక ఆదేశాలతో ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ విచారణ చేపట్టి, నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మళ్లించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖాతాలకు జమ చేయించాలని, అలాగే తెలంగాణకు రావాల్సిన మిగిలిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!