

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల వ్యవసాయ విధానాలు దేశంలో కొత్త భూస్వామ్య వ్యవస్థకు దారితీస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివారం నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగసభలో వక్తలు పిలుపునిచ్చారు. దేశంలో దాదాపు 80 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల భూమి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని వారు విమర్శించారు. నాటి భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల దోపిడీతో పాటు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సాగిన చారిత్రాత్మక వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వారు గుర్తుచేశారు. అదే పోరాట స్ఫూర్తితో కార్పొరేట్ భూస్వామ్యాన్ని సవాల్ చేయాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు నల్గొండలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూకంటి రంగారెడ్డి సభకు అధ్యక్షత వహించారు.
సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు బృందా కరత్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, వ్యవసాయ రంగాన్ని, రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇందుకు మూడు నల్ల వ్యవసాయ చట్టాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘంగా పోరాడి వాటిని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ, అదే విధానాలను ప్రభుత్వం పరోక్షంగా అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. భూ పరిమితి చట్టాల అమలు కోసం ఏఐకేఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఐకేఎస్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిందని, తెభాగా, వర్లీ, వీర తెలంగాణ వంటి అనేక రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిందని గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా సాగుతున్న తీరును కూడా ఆమె విమర్శించారు. ఇలాంటి ఒప్పందాలు భారత రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు ఐక్యంగా వాటిని వ్యతిరేకించాలని కోరారు.
కనీస మద్దతు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై కూడా బృందా కరత్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తూ వారిని అటవీ ప్రాంతాల నుంచి బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 15న జరుపుకునే ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా జయంతిని ప్రస్తావిస్తూ, ఆయన చూపిన మార్గంలో ఏఐకేఎస్ ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతపరమైన రంగు పులమడానికి చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. నల్గొండలో జరుగుతున్న ఏఐకేఎస్ మహాసభల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు రైతాంగ ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. తన ప్రసంగాన్ని “సోదరీ సోదరులారా, అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో ప్రారంభించిన బృందా కరత్ సభికుల్లో ఉత్సాహాన్ని నింపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!