

ఆంధ్రప్రదేశ్లోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు భారీ స్పందన లభించింది. నవంబర్ 14, 15 తేదీల్లో కలిపి మొత్తం 1,774 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 15న రెండో రోజు ఒక్కరోజే 1,502 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వీటిలో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు 69, వార్డు సభ్యుల స్థానాలకు 1,433 నామినేషన్లు వచ్చాయి. రెండు రోజుల్లో కలిపి మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు 85 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,689 నామినేషన్లు దాఖలయ్యాయి.
నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో రెండు రోజుల్లో కలిపి 532 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 428 నామినేషన్లు రాగా.. వాటిలో మేయర్ స్థానాలకు 16, వార్డు సభ్యుల స్థానాలకు 412 ఉన్నాయి. మరోవైపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 1,240 నామినేషన్లు నమోదయ్యాయి. రెండో రోజు 1,072 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఛైర్పర్సన్ స్థానాలకు 53, వార్డు సభ్యుల స్థానాలకు 1,019 నామినేషన్లు వచ్చాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని 20వ వార్డుకు రెండో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లోనూ ఆ వార్డుకు మొత్తం రెండు నామినేషన్లు నమోదయ్యాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!