

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ విజయంతో హీరో యష్‌కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత దాదాపు 4 సంవత్సరాల విరామంతో ఆయన నటించిన చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. విడుదలకు ముందే ఈ చిత్ర డిజిటల్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుందని మేకర్స్ భావించారు. అయితే వారు ఆశించిన స్థాయిలో ఓటీటీ సంస్థల నుంచి స్పందన రాలేదని సమాచారం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ సంస్థలు భారీ మొత్తంలో డిజిటల్ హక్కులు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జీ స్టూడియోస్ ముందుకు వచ్చినప్పటికీ ఆ ఆఫర్ కూడా యష్‌కు నచ్చలేదని వార్తలు వచ్చాయి.
తక్కువ మొత్తానికి ఓటీటీ హక్కులు విక్రయించకుండా, సినిమా విజయవంతమైన తర్వాత మరింత మంచి ధర లభిస్తుందనే అంచనాతో యష్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అయితే ‘టాక్సిక్’కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఆ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా పరాజయం కారణంగా నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యష్ తన పారితోషికం, లాభాల్లో వాటా విషయంలో కొంత నష్టాన్ని భరించి పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను చివరకు ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!