

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన న్యాయవాది, సామాజిక సేవకుడు మెండు రాజమల్లుకు ‘డాక్టరేట్ – న్యాయ సేవా రత్న’ పురస్కారం లభించింది. న్యాయ సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ లీడర్స్ అండ్ విజనరీస్ కాంక్లేవ్-2026 ఈ అవార్డును ప్రదానం చేసింది. నవంబర్ 29న తిరుపతిలోని హోటల్ రెగాలియాలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 126 మందికి పురస్కారాలు అందజేశారు. సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేష్ చేతుల మీదుగా మెండు రాజమల్లు అవార్డును స్వీకరించారు.
కొత్తగూడెం కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజమల్లు, లీగల్ సర్వీసెస్ సభ్యుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు న్యాయ సేవలు అందించారు. లయన్స్ క్లబ్‌తో పాటు పలు సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్టాఫీస్ ప్రాంతం, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిరుపేదలకు అన్నదానం చేశారు. పాల్వంచలో నేతాజీ యువజన సంఘం ద్వారా నిరాశ్రయులకు దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. న్యాయ, సామాజిక సేవల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మరో విశేషమేమిటంటే, అవార్డు అందుకున్న రోజే రాజమల్లు దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం కూడా కావడం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!