

రెండు నెలల పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘ధురంధర్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనే ఆసక్తి పెరిగింది. ఓటీటీలో చూసిన తెలుగు ఆడియెన్స్ నుంచి ఈ చిత్రానికి ప్రస్తుతం మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది.
సాధారణంగా స్పై థ్రిల్లర్ సినిమాలు ఒకే తరహాలో ఉంటాయి. కానీ ‘ధురంధర్’ మాత్రం పూర్తిగా పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్‌గా తెరకెక్కడంతో కొత్త అనుభూతిని ఇచ్చింది. రణ్వీర్ సింగ్ నటించిన హమ్జా పాత్ర కీలకమైనదే అయినా, అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ పాత్రలు థియేటర్లలో మంచి స్పందన పొందాయి. అయితే దక్షిణాదిలో ఇప్పటికే పుష్ప, కేజీఎఫ్ లాంటి మాస్ సినిమాలు చూసిన ప్రేక్షకుల్లో కొందరికి ఈ సినిమా నిడివి, స్టైల్ కొత్తగా అనిపించలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దర్శకుడు ఆదిత్య ధర్ నిజ జీవిత సంఘటనలైన కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై దాడి, ముంబై తాజ్ హోటల్ దాడిని కథలో భాగం చేసిన తీరు ప్రశంసనీయం. అయితే ఆ ఘటనలపై ముందే అవగాహన ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ సహజంగా ఉండటంతో పాటు, పాటలను హిందీలోనే ఉంచడం సినిమాకు ప్లస్ అయ్యింది. మొదట కలర్ గ్రేడింగ్, సౌండ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ విమర్శలు ఎదుర్కొన్నా, తర్వాత వాటిని సరిచేసింది. థాయ్‌ల్యాండ్‌లో కరాచీ ప్రాంతాన్ని అచ్చుగుద్దినట్టు రూపొందించిన సెట్లు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ వచ్చే నెల 19 న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!