

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
న్యూ ఇయర్ ఈవెంట్లు, వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటినా లేదా నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైన్ షాపులు, బార్లు మూసిన తర్వాత ‘బ్యాక్‌డోర్’ ద్వారా మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై చర్యల కోసం సాయంత్రం 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక డ్రైవ్ జనవరి తొలి వారం వరకు కొనసాగుతుందని తెలిపారు.
మద్యం మత్తులో పట్టుబడితే జరిమానా, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
మద్యం సేవించిన వారు క్యాబ్‌లు లేదా డ్రైవర్ల సేవలను వినియోగించాలని తెలిపారు. రైడ్ నిరాకరించినా లేదా అదనపు ఛార్జీలు వసూలు చేసిన క్యాబ్, ఆటో డ్రైవర్ల పై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే 94906 16555 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!