

దౌల్తాబాద్ మండలంలో వీధి కుక్కలు రెచ్చిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన కుక్కల దాడుల్లో ఓ విద్యార్థి, మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు, 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, కోనాపూర్ గ్రామానికి చెందిన మైలుగారి చంద్రయ్య కుమారుడు మనోజ్ (12) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాల బస్సు మిస్ కావడంతో కాలినడకన బయలుదేరిన మనోజ్‌పై దారిలో కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
ఇదే రోజు గోవిందపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణ కుమార్తె అద్విక (3) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. విచక్షణారహితంగా కరవడంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ రెండు ఘటనల్లో గాయపడ్డ బాలుడు, చిన్నారిని 108 అంబులెన్స్ సిబ్బంది భానుప్రకాష్, నరసింహులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోయిందని, బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కలను షెల్టర్ హోంకు తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!