

బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది థీమ్ “నా భారత్ – నా ఓటు” పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని తెలియజేస్తోందని గవర్నర్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతత్వమే స్వేచ్ఛాయుత ఎన్నికలకు పునాదిగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అర్హులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్, ఆధునిక సాంకేతికత వినియోగంతో తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మరింత సమగ్రంగా మారిందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, యువ ఓటర్లు మరియు సీనియర్ సిటిజన్ల నమోదు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!