

సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై దాడి చేసిన ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పేరును దుర్వినియోగం చేస్తూ లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తూ కరాటే కళ్యాణి గతంలోనే ఫిర్యాదు చేశారు. రూ.399కే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు గెలుస్తాయని తప్పుడు ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ఆదిభట్ల సమీపంలోని వండర్లా పరిసరాల్లో లక్కీ డ్రా ప్రచారం చేస్తున్న సమయంలో నరేందర్‌ను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కళ్యాణిపై దాడి చేసేందుకు దాదాపు 10 మంది యత్నించగా, ఆమె చున్నీ లాగి భయపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు నరేందర్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75, 79, 115(2), 132, 351(2), 352 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులో కూడా నరేందర్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!