

మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారతదేశంలోనూ, ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు. 1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు.
టీఎఫ్ఆర్ మరింత వేగంగా తగ్గితే వర్క్ ఫోర్స్ పడిపోతుందని... దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఈ అంశంపై చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్మెంట్కు మూలస్తంభాలన్నారు










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!