

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికు చట్టబద్ధ హోదా కల్పించే బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్రం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై 149 నిమిషాల పాటు విస్తృత చర్చ జరిగింది. కాంగ్రెస్, భాజపా సహా 10 పార్టీలకు చెందిన 16 మంది సభ్యులు బిల్లుకు మద్దతు తెలపగా, వైకాపా మాత్రం వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. ఈ బిల్లుతో భవిష్యత్తులో రాజధాని అంశంపై అనిశ్చితి తొలగిపోయిందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
చర్చలో పాల్గొన్న సభ్యులు అమరావతి కోసం రైతులు, మహిళలు చేసిన ఉద్యమాలను ప్రశంసించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దార్శనికతను కొనియాడుతూ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లుపై స్పందిస్తూ, ఇది చారిత్రాత్మక నిర్ణయమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయని తెలిపారు.
రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ దేశ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రాజ్యసభ గ్యాలరీలో చర్చను వీక్షిస్తూ, బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి ప్రత్యేక చట్టబద్ధ హోదా ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!