

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులతో ఇరాన్‌పై యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఐదో రోజు బుధవారం రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై భారీ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్ తూర్పు ప్రాంతంలోని ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ సుమారు 100 యుద్ధవిమానాలతో దాడి చేసి 250 బాంబులు వదిలినట్లు సమాచారం. ఈ కేంద్రంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళాలు, ఖుద్స్ ఫోర్స్, నిఘా విభాగాలు మరియు ఇతర కీలక సైనిక యూనిట్లు ఉన్నట్లు పేర్కొనబడింది. టెహ్రాన్‌లో తెల్లవారుజామునుంచే భారీ పేలుళ్లు చోటుచేసుకుని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. షియా మత కేంద్రంగా గుర్తింపు పొందిన ఖోమ్ నగరంపై కూడా వైమానిక దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది. జెరూసలెంలో భారీ పేలుళ్లు వినిపించగా సౌదీ అరేబియాలోని రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. అలాగే దుబాయ్ ప్రాంతంలోని అమెరికా కాన్సులేట్ సమీప ప్రాంతాలపై కూడా డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 1,045 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరుకోగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. భద్రతా కారణాల వల్ల గల్ఫ్ దేశాలకు వెళ్లే అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!