

అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం, కొలంబియా ప్రాంతంలో భారత యువతి నికిత గొడిశాల (27) దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించకుండా పోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నికిత కనిపించడం లేదని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా డిసెంబరు 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్మెంట్లో నికితను చూసినట్లు అర్జున్ తెలిపాడు. అయితే ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే అతడు జనవరి 2 న భారత్‌కు వెళ్లిపోయిన విషయం పోలీసులకు అనుమానం కలిగించింది.
దీంతో పోలీసులు సెర్చ్ వారెంట్‌తో అర్జున్ అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా, అక్కడ నికిత మృతదేహం బయటపడింది. ఆమె శరీరం పై గాయాలు ఉండటంతో ఇది హత్యేనని అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, డిసెంబరు 31 నే నికిత హత్యకు గురైనట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత్‌కు పారిపోయిన అర్జున్ను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, నికిత ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆమె స్నేహితులు, ఆమె హత్యకు గురైన విషయం తెలిసి తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!