

తెలంగాణలో వేసవి తీవ్రత ముందుగానే కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మూడో వారంలో పెరిగే ఎండలు ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మొదటిసారిగా మంగపేట, ములుగు జిల్లాలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్, ధర్మపురి, ఖమ్మం ప్రాంతాల్లో 38.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రాబోయే రోజులకు హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడి, వేడి గాలులు మరియు గాలిలో తేమ శాతం తగ్గడం వల్లే ఈ తీవ్రత పెరుగుతోందని నిపుణులు తెలిపారు. మధ్యాహ్నం పూట అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!