

అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది.
సౌదీ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, రెండు డ్రోన్లతో దాడి జరిగింది. మంటలు వ్యాపించినప్పటికీ భవనానికి స్వల్ప నష్టం మాత్రమే వాటిల్లిందని తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉండడంతో ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించింది.
ఈ ఘటన తర్వాత రియాద్, జెడ్డా, దహ్రాన్ నగరాల్లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అక్కడి అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. ఇదే సమయంలో రియాద్‌లో మరికొన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవల కువైట్‌లోని అమెరికా ఎంబసీపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. రియాద్‌లో జరిగిన దాడికి తగిన ప్రతిస్పందన ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!