

ప్రముఖ సినీ గీత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని అనకాపల్లి గాంధీనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఘనంగా ఆవిష్కరించారు. తానా సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలో ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శాస్త్రి కుటుంబ సభ్యుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహావిష్కరణ అనంతరం పెంటకోట కన్వెన్షన్ హాల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి మహోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, రథసప్తమి రోజున అనకాపల్లిలో జన్మించి అదే ప్రాంతంలో పెరిగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో కవిగా ఎదిగి తన స్వగ్రామానికి గౌరవం తీసుకొచ్చారని తెలిపారు. ఆయన పుట్టిన ప్రాంతంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించడం దైవ సంకల్పమేనని అన్నారు. ప్రతి సంవత్సరం సిరివెన్నెల కళాపీఠం పేరిట సాహిత్య అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జీవించి ఉన్నా లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేవారు చాలా అరుదని, అలాంటి వారిలో సిరివెన్నెల ఒకరని పేర్కొన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమా ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త దిశ చూపిన మహనీయుడు సిరివెన్నెల అని కొనియాడారు. తానా ప్రతినిధులు ఆయన మూడు వరుస నంది అవార్డులు సాధించిన ప్రస్థానాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు శాస్త్రి కుటుంబ సభ్యులకు సత్కారం నిర్వహించి, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వారు పూర్ణకుంభ స్వాగతంతో ఆశీర్వదించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!