

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి సభలో చదివి వినిపించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ రవినాథ్ తిల్హరి తో కలిసి జస్టిస్ బాలాజీ కేసుల విచారణ చేపట్టారు. ఆయన నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33 కు చేరింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పీపీ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, న్యాయవాదుల సంఘం ఇన్‌ఛార్జి అధ్యక్షుడు రఘువీర్ తదితరులు హాజరయ్యారు. జస్టిస్ బాలాజీని కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు అభినందించారు.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాలాజీ 1972 మే 29 న వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం శేషన్నగారిపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు. పాఠశాల విద్యను రాజంపేటలో పూర్తి చేసి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని పడాల రామారెడ్డి న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు.
కుటుంబంలో తొలి తర న్యాయవాదిగా 1997లో అప్రెంటిస్‌గా ప్రారంభించి, 1998 ఏప్రిల్ 9 న బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, సర్వీసు, కమర్షియల్ అంశాలలో విశేష అనుభవం సంపాదించారు.
2004 నుండి 2006 వరకు అప్పటి అడ్వకేట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా సేవలందించారు. 2018-19 మధ్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. పలు బ్యాంకులు, ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా సేవలందించారు.
జస్టిస్ బాలాజీకి భార్య కళ్యాణి , కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!