

రబీ (యాసంగి) సీజన్లో యూరియా కొరత రాకుండా, బ్లాక్మార్కెట్లో అక్రమ విక్రయాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. రైతులు ఈ సీజన్లో ఎంత భూభాగంలో పంట వేశారు అన్న వివరాలను పట్టాదారు పాస్బుక్ల ద్వారా సేకరించి, అదే ఆధారంగా యూరియా పంపిణీ చేయనుంది.
గత పంటకాలంలో అధిక యూరియా వినియోగం, నిల్వల క్రమబద్ధీకరణ లేకపోవడంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులకు యూరియా దొరకలేదు. కొందరు రైతులు బ్లాక్మార్కెట్లో ₹150 అదనంగా చెల్లించి కొనాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది వ్యవసాయ శాఖ.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి లేఖ రాసింది. నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరింది. అయితే గత రెండు నెలల్లో అవసరమైన నిల్వల్లో సగమే వచ్చాయని అధికారులు తెలిపారు. మిగిలిన నిల్వలు త్వరగా పంపించాలని కేంద్ర రసాయనాల శాఖను రాష్ట్రం కోరింది. ఆలస్యం జరిగితే రైతుల ఆగ్రహం తప్పదని హెచ్చరించింది.
రైతులు సాగు చేసిన విస్తీర్ణానికి మించి యూరియా తీసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఆధార్-లింక్డ్ పోస్ యంత్రాలతో ఇప్పటికే యూరియా, ఇతర ఎరువుల విక్రయం జరుగుతోంది. తప్పుగా అధికంగా కొనుగోలు చేసి బ్లాక్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తే కొద్ది సేపులోనే గుర్తించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
పంట సీజన్లో యూరియాకు డిమాండ్ పెరుగుతుందని ముందే అంచనా వేసుకున్న కొంతమంది ఎరువుల వ్యాపారులు కావాలని కృతిమ కొరత సృష్టించి, రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్టు బయటపడింది. ఇక మధ్యవర్తులు రైతుల వేషంలో క్యూల్లో నిలబడి యూరియా బస్తాలు కొనుగోలు చేసి మళ్లీ దుకాణదారులకు అప్పగించే అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
కొత్త పంపిణీ విధానంతో ఈ దందాకు అడ్డుకట్ట పడనుందని అధికారులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో, బస్తాపై ముద్రించిన MRPకే అమ్మకాలు జరగాల్సి ఉంటుంది.
అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి:
1.85 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
65 టన్నుల DAP
2.50 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు
అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్‌కు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!