

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘టాక్సీవాలా’ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్, రొమాంటిక్ సాంగ్ సినిమాపై బజ్ను మరింత పెంచాయి. తాజా సమాచారం ప్రకారం, ‘రణబాలి’కి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని, ఎలాంటి కట్స్ లేకుండా క్లియరెన్స్ లభించిందని ప్రచారం జరుగుతోంది. సినిమా రన్టైమ్ సుమారు 2 గంటల 50 నిమిషాలని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
1854 నుంచి 1878 మధ్య రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, ప్రజలపై విధించిన అన్యాయపు పన్నుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. పేద ప్రజల పక్షాన నిలబడి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఓ స్థానిక యోధుడి కథను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జోడీని మరోసారి తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యం, యాక్షన్ అంశాలు, భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!