

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. నిజాం పాలనను గొప్పగా అభివర్ణించడం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. నిజాం మంచివాడైతే తెలంగాణ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించారని నిలదీశారు. తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారని, గ్రామాల్లో బురుజులు నిర్మించి ఉద్యమాలు ఎందుకు నిర్వహించారో సీఎం సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించేలా మాట్లాడటం సరికాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2029లో తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించేలా చూస్తామని ప్రకటించారు. మజ్లిస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న అంశంపై తెలంగాణ బీజేపీ ఇప్పటికే అసెంబ్లీలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!