

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు జానకి రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వినోదాత్మక వాణిజ్య చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోన వెంకట్ సమర్పణలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో, ఇందులో కీలక రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ షూటింగ్ సమయంలో ఎదురైన ప్రమాదాన్ని వెల్లడించారు. దట్టమైన అడవిలో ఎత్తైన వంతెనపై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు.
ఆ సన్నివేశంలో తన పాత్రపై ఎవరైనా దాడి చేసినప్పుడు వెనక్కి పడిపోవాల్సి ఉందని, అయితే అనుకోకుండా కాలు జారి వంతెనపై నుంచి కిందపడే పరిస్థితి ఏర్పడిందని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం తనను సురక్షితంగా కాపాడిందని, ఆ ఘటన నుంచి బయటపడటాన్ని పునర్జన్మగా భావిస్తున్నానని తెలిపారు. క్లిష్టమైన సన్నివేశాల చిత్రీకరణలో నటీనటులు కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ సమయంలో శ్రీవిష్ణు, కోన వెంకట్, దర్శకుడు జానకి రామ్ అక్కడే ఉన్నారని చెప్పారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’కు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!