

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించినప్పటికీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘బిల్లా రంగా బాషా’లో నటిస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2209 సంవత్సరం నేపథ్యంలో సాగే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సుదీప్ సొంత బ్యానర్ సుప్రి యాన్వి పిక్చర్స్ కూడా భాగస్వామ్యంగా ఉంది.
ఇటీవల సుదీప్ సినిమాలకు విరామం తీసుకున్నారని వచ్చిన వార్తలపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన కెరీర్ పట్ల గానీ, అభిమానుల ప్రేమ పట్ల గానీ ఎప్పుడూ నిర్లక్ష్యం చూపలేదని స్పష్టం చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, తన మద్దతు అవసరమైన పరిస్థితుల కారణంగా ఈ చిన్న విరామం తీసుకున్నానని తెలిపారు. జూన్ 26 నుంచి ‘బిల్లా రంగా బాషా’ షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇకపై ఎలాంటి విరామం లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్‌లు లాక్ చేసినట్లు చెప్పడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!