

బాలీవుడ్ నటి సయామీ ఖేర్ మరో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రకు ఎంపికయ్యారు. ప్రముఖ దర్శకుడు మాక్సిమ్ కుజ్నెత్సోవ్ తెరకెక్కిస్తున్న ఇండో-రష్యన్ డ్రామాలో ఆమె నటిస్తున్నారు. భారత్, రష్యాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్, వైట్ నైట్ ఫిల్మ్స్, విష్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సయామీ ఖేర్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. విదేశీ చిత్రబృందంతో కలిసి పనిచేయడం తనకు కొత్త, విభిన్నమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. తొలిసారి రష్యాకు వెళ్లానని, మాస్కో నగరం ఎంతో అందంగా ఉందని ప్రశంసించారు. భారత్‌లోని వాతావరణం, అక్కడి పని విధానం మధ్య చాలా తేడా ఉందని, ఈ అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లలో మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు సయామీ వెల్లడించారు. దేశాలు, భాషల సరిహద్దులను దాటి పనిచేయడం సరదాగా ఉండటమే కాకుండా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. విభిన్న సంస్కృతులకు చెందిన వారితో కలిసి పనిచేయడం వల్ల కథలను చెప్పే విధానంలో కొత్త కోణాలు తెలుస్తాయని అన్నారు. ఈ సినిమా వివరాలను ఇప్పుడే వెల్లడించడం తొందరపాటే అయినప్పటికీ, బలమైన మహిళా ప్రధాన పాత్ర చుట్టూ కథ సాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని, ప్రత్యేకమైన శైలిలో పనిచేసే అంతర్జాతీయ బృందంతో కలిసి అనుభవం సంపాదించడం ఆనందంగా ఉందని సయామీ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!