

వస్తువులు కొనుగోలు చేయాలన్నా, హోటల్ బుక్ చేసుకోవాలన్నా, సినిమా చూడాలన్నా రేటింగ్స్, రివ్యూలను పరిశీలించడం సాధారణం. మరి జీవితంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటైన ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యత, పర్యావరణ ప్రమాణాలను ఎలా తెలుసుకోవాలి? ఇందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రేటింగ్స్ ఉపయోగపడతాయి. హరిత భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 2001లో హైదరాబాద్ కేంద్రంగా ఐజీబీసీని ఏర్పాటు చేసింది. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ భవనాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో పాటించే పర్యావరణ ప్రమాణాలను పరిశీలించి సర్టిఫికేషన్ ఇస్తుంది. నివాస భవనాలకు సర్టిఫైడ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే నాలుగు స్థాయిల్లో రేటింగ్స్ అందిస్తుంది. నీరు, విద్యుత్తు ఆదా, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య ఉద్గారాల తగ్గింపు, పర్యావరణహిత నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాల ఆధారంగా ఈ రేటింగ్స్ కేటాయిస్తారు. వ్యక్తిగత ఇళ్లకు కూడా గ్రీన్ హోమ్స్ విభాగంలో సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది.
ఈ నాలుగు రేటింగ్స్‌లో సర్టిఫైడ్ ప్రాథమిక స్థాయి కాగా, కనీస పర్యావరణ ప్రమాణాలను పాటించే భవనాలకు లభిస్తుంది. నిర్మాణ దశలోనే ప్రమాణాలు పరిశీలించి ఇచ్చే గుర్తింపును ప్రీ సర్టిఫికేషన్‌గా పిలుస్తారు. సిల్వర్ స్థాయికి వాననీటి నిల్వ, నీటి పొదుపు పరికరాలు, స్థానిక మొక్కలు, రీసైకిల్ చేసిన నిర్మాణ సామగ్రి, వ్యర్థాల నిర్వహణ వంటి అదనపు చర్యలు అవసరం. గోల్డ్ రేటింగ్ కోసం విద్యుత్తు, నీటి ఆదాతోపాటు వ్యర్థాల శుద్ధి, సహజ గాలి, వెలుతురు ప్రసరణ, మెరుగైన గాలి నాణ్యత, తక్కువ వీవోసీ కలిగిన పెయింట్లు, గ్లూల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్లాటినం అత్యున్నత స్థాయి రేటింగ్. భవన ప్రాంగణంలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి ప్లాంటు, సౌర వాటర్ హీటింగ్, వెదురు వంటి త్వరగా పునరుత్పత్తి అయ్యే నిర్మాణ సామగ్రి వినియోగం దీనికి అవసరం. హరిత భవనాల వల్ల సుమారు 30 శాతం నీరు, 40 శాతం వరకు విద్యుత్తు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాకుండా ఆరోగ్యకరమైన నివాస వాతావరణం లభించడంతోపాటు ఇలాంటి ఇళ్లకు మార్కెట్‌లో అధిక ధర, అద్దె వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!